ఆఖరిగా చూసినది ఎప్పుడు?? ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎంత గుర్తు చేసుకున్నా ఆనవాలు చిక్కట్లేదు. ఇంట్లో మనిషే కదా రోజు చూస్తూనే ఉన్నానా? కాదేమో అంతకుముందు కొంతకాలంగా చూసినట్టుగా, మాట్లాడినట్టుగా మాటలేమి గుర్తులేదు. అలాగని తనతో పేచీలు, మనస్పర్ధలు అసలే లేవు.
నా మాట వేదవాక్యంగా తనకి మారాక హఠాత్తుగా నా వయసు రెండింతలుగా మారి పెద్దరికం ఆపాదించుకుంది అదే తను అప్పుడప్పుడు గుర్తు రావడానికి ఒక కారణం కావచ్చు.
చెప్పే ప్రతి మాట, ఆలోచించి చెప్తానని ఎంత నమ్మకమో! నేను చెప్పిందానికి ఒక్క మాట కూడా అటు ఇటుగా చేయాలని అనుకోకపోవడం ఇప్పటికీ ఈరోజుకి తలుచుకున్నా ఒకింత ఆశ్చర్యమే.
తను లేకుండాపోయి కొన్ని పదుల సంవత్సరాలు. పంచుకున్న సమయాలకి కాలం చెల్లిపోయి, జ్ఞాపకాల దొంతరలో ఆనవాలు చెరిగిపోయింది. అయినా ఇప్పటికీ నా కొన్ని క్షణాల ప్రతిరోజు దొంగిలించబడుతూనే ఉన్నాయి నేర్చుకున్న పాఠాల ప్రశ్నలతో...
మనుషుల ప్రేమలు, స్వార్థాలు... అయినవాళ్ళు కానివాళ్ళు అనే లెక్కలు తారుమారు చేసి, ఎవరి దుఃఖానికి ఎంత కొలత అని బేరీజు లెక్కలు నేర్చుకున్నది అప్పుడేగా....
అబ్బో ఎన్నెన్ని పాఠాలు నేర్పించి వెళ్ళిందో ఓ చావు. ఆ మొదటి పాఠం ఇప్పటికీ జీవితపు తక్కెడలో మారని కొలతరాయి.